టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నవారిలో సుహాస్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా ‘కలర్ ఫోటో’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.
ఈ నేపథ్యంలో సుహాస్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. ‘ప్రసన్నవదనం’ అనేది ఈ మూవీ టైటిల్ కాగా.. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ని ఇటీవలే విడుదల చేయగా.. మంచి స్పందన రాబట్టుకుంది.
ఇక టీజర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రసన్న వదనం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిందని అర్ధమవుతుంది. సుహాస్ ఈ సినిమాలో ‘ఫేస్ బ్లైండ్‌నెస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి బారిన పడినవారు ఎదుటివారి ముఖాన్ని గుర్తుపట్టలేరు.
కాగా ‘ప్రసన్నవదనం’ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్లపై నిర్మాతలు మణికంఠ, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ మరియు తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసన్న వదనం సినిమాను ఈ రెండు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఈ న్యూస్ బయటకు వచ్చాక ఈ చిత్రంపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. కాగా మే 3న ‘ప్రసన్నవదనం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.